అనంతపురం జిల్లా:సెప్టెంబరు17
మతి స్థిమితంలేని ఓ వ్యక్తి కొడవలితో ఇద్దరిని నరికి చంపాడు. వారి మృతదేహాల వద్ద కూర్చుని సైకోలా ప్రవర్తించాడు. అరుపులు.. కేకలువిని అక్కడికి వచ్చినవారిపై దాడికి సిద్ధమయ్యాడు.
దీంతో గ్రామస్థులు రాళ్లతో దాడి చేసి ఆ వ్యక్తిని చంపేశారు. కలకలం రేపిన ఈ ఘటన అనంతపురం జిల్లా యాడికి మండల పరిధిలోని నిట్టూరు గ్రామం లో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.నిట్టూరుకు చెందిన ప్రసాద్ (30) కట్టెలు అమ్మి కుటుంబాన్ని పోషించేవాడు. తర చూ మతిస్థిమితం లేనట్లు ప్రవర్తించేవాడు.
ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున కొడవలి పట్టుకుని గ్రామంలోని కొన్ని ఇళ్ల వద్దకు వెళ్లి తలుపు తట్టాడు. ఎవరూ స్పందించకపోవడంతో తన ఇంటి ఎదుట ఆరుబయట నిద్రిస్తున్న సుంకులక్క(45), బాలరాజు (52) దం పతులను నరికి చంపాడు. వారి అరుపులు విని గ్రామస్థులు బయటకు వచ్చి చూసేసరికి మృతదేహాల వద్ద ప్రసాద్ కూర్చుని కనిపించాడు. చేతిలో రక్తమోడుతున్న కొడవలి ఉండటంతో వారు భయాందోళకు గురయ్యారు.
గుంపుగా చేరుకున్న గ్రామస్థులపై ప్రసాద్ దాడికి యత్నించాడు. ఈ నేపథ్యంలో అందరూ అతనిపై రాళ్లతో దాడిచేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, యాడికి సీఐ శంకర్‌రెడ్డి, ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి సిబ్బందితో గ్రామానికి చేరుకుని విచారించారు. బాలరాజు, సుంకులక్క కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ శంకర్‌రెడ్డి తెలిపారు.
గ్రామస్థుల దాడిలో ప్రసాద్ మృతిచెందాడని, దీనిపై కూడా కేసు నమోదు చేశామని చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.