హైదరాబాద్: భారాస నేతలకు కాంగ్రెస్‌ను విమర్శించే అర్హతలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరాన్ని కేసీఆర్ ఏటీఎంలా వాడుకుంటున్నారని ఆరోపించారు.
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు వ్యయం కన్నా.. దానికి చేసిన ప్రకటనల ఖర్చే ఎక్కవన్నారు. నగరంలోని తాజ్‌కృష్ణలో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు. కాళేశ్వరం సరిపోలేదని.. దిల్లీ లిక్కర్ స్కామ్‌కు కేసీఆర్ కుటుంబం పాల్పడిందని విమర్శించారు..
”మద్యం కేసులో భాజపా, భారాస నాటకాలాడుతున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు కుమార్తెను జైలుకు పంపేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. కవిత అరెస్టుతో సానుభూతి పొందాలని చూస్తున్నారు. కేసీఆర్.. కిషన్ రెడ్డి వేర్వేరు కాదు. కేసీఆర్ అనుచరుడు కిషన్‌రెడ్డి. భాజపా పెద్దలు అతడిని అధ్యక్షుడిగా ఎందుకు చేశారో కిషన్‌రెడ్డికి తెలుసా? సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నప్పుడే పోటాపోటీగా దినోత్సవాలు చేస్తున్నారు. కాంగ్రెస్ సభను అడ్డుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఇవాళ్టి వరకు ఈడీ, సీబీఐ కాదు.. ఈగ కూడా వాలలేదు. మోదీ, అమిత్ షా, నడ్డా విమర్శలు చేస్తారు కానీ.. ఒక్క కేసు కూడా పెట్టలేదు. కేసీఆర్ అవినీతిపై భాజపా ఎందుకు విచారణకు ఆదేశించలేదు” అని రేవంత్ ప్రశ్నించారు..