స్కిల్ స్కామ్ కేసు నుంచి ఎలా బయటపడాలా అని.. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తలపట్టుకుంటున్నారు. కోర్టుల్లో పిటిషన్ల మీద పిటిషన్లతో ఈ కేసు ముందుకెళ్తుంటే..
మరికొన్ని కేసులు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. ఆ కేసులకు సంబంధించిన పలు పిటిషన్లు ఇవాళ విచారణకు రాబోతున్నాయి. వాటిల్లో అయినా చంద్రబాబుకు ఊరట దక్కుతుందా?
రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు.. ఆయన జీవితంలోనే అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కేసుల మీద కేసులు ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఇప్పటికే 17 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారాయన. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టులో చంద్రబాబు వేసిన అన్ని పిటిషన్లలోనూ ఆయనకు ప్రతికూలంగా తీర్పు వచ్చింది. దీంతో సుప్రీంకోర్టులోనూ న్యాయపోరాటం చేస్తున్నారాయన. ఇదిలా ఉంటే మరికొన్ని కేసులను తిరగదోడే పనిలో ఉన్నారు సీఐడీ అధికారులు. వాటికి సంబంధించిన పలు పిటిషన్లు ఇవాళ విచారణకు రానున్నాయి.