అసలు దొంగల్ని తాడేపల్లి ప్యాలెస్‌లో దాచి… చంద్రబాబుపై కేసులా?: ప్రత్తిపాటి
ఒక అవినీతిపరుడు, అరాచకవాదికి అధికారం అందితే ఎలాంటి విపరిణామాలు, దారుణాలు చూడాల్సి వస్తుందో సైకో ముఖ్యమంత్రి జగన్ ఇవాళ కళ్లకు కడుతున్నారని మాజీమంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. చంద్రబాబు అరెస్టు వెనక భారీ కుట్ర ఉందని.. అసలు దొంగల్ని తాడేపల్లి ప్యాలెస్‌లో దాచి చంద్రబాబుపై కేసులా? అని మండిపడ్డారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చలేని విజనరీ నాయకుడు చంద్రబాబు అని.. 73 ఏళ్ల వయసులోనూ నవ యువకుడిగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతిక్షణం పరితపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కేబినేట్, చట్టసభల అనుమతితోనే వనరుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న దాని మీద కేసుపెట్టి అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు. చంద్రబాబు హయాంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారిగా పనిచేసిన పీవీ రమేశ్ వ్యాఖ్యాలను కూడా వక్రీరించాని మండిపడ్డారు. నాటి స్కిల్ డెవలెప్‌మెంట్ ఎండీ, కార్యదర్శిల పేర్లు ఎందుకు పెట్టలేదని.. ఎండీ, కార్యదర్శిల పాత్రే ప్రధానమని.. వారి పేర్లు ఏవి? అని ప్రశ్నించారు. చిలకలూరిపేటలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడుతూ జగన్ కబంధ హస్తాల్లో చిక్కుకున్న రాష్ట్రాన్ని చెరవిడిపించాలని.. తిరిగి అభివృద్ధి బాట పట్టించాలని చంద్రబాబు పోరుబాట పట్టారని అన్నారు. అరెస్టులు, నిర్బంధాలు, అణచివేతలు, దాడులు ఉంటాయని తెలిసి కూడా ప్రజల కోసం, ప్రజల మేలు కోసం, ఆ ప్రజల మధ్యే నిలబడ్డారని తెలిపారు. జగన్ రాక్షస వేధింపులకు, అరాచక దాడులకు భయపడే వ్యక్తి అయితే పార్టీ కార్యాలయంపై దాడి జరిగినప్పుడు, తన ఇంటిపై వైకాపా దండయాత్ర చేసినప్పుడు, ఎన్‌ఎస్‌జీ రక్షణ చట్రంలో ఉన్న చంద్రబాబును చంపాలని చూసినప్పుడే వెనకడుగు వేసేవారని.. కానీ మా నాయకుడికి అది తెలియదని.. తనకన్నా, తన ప్రాణం కన్నా, తన పదవుల కన్నా, తన రాజకీయం కన్నా ఈ రాష్ట్రం బాగుండాలి.. ఈ ప్రజలు బాగుండాలి అన్న ఒకే ఒక సంకల్పంతో ఈ పోరాటాన్ని ప్రారంభించారని వ్యాఖ్యానించారు. చంద్రబాబును వేధించి జగన్ పొందిన సైకో ఆనందం ఏంటో ప్రజలు వారి కళ్లతో చూశారని.. ఆ జనమే జవాబు చెబుతారని.. ఇక్కడ కావాల్సిందిల్లా సందర్భమని.. ఆ సందర్భానికి మా నాయకుడు ఇంతకు రెట్టించిన ఉత్సాహంతో ప్రజాబలంతో మీ ముందు నిలబడతారు.. ఆరోజు నువ్వు కాదు కదా నిన్ను పుట్టించిన ఆ జేజమ్మ వచ్చినా నువ్వు తప్పించుకోలేవని జగన్‌ను ఉద్దేశించి హెచ్చరించారు. మా నాయకుడిని జైలులో పెట్టానని సంబరం పడుతున్నావా జగన్… లెక్కబెట్టుకో ఇక నీ కౌంట్‌డౌన్ మొదలైంది.. నిన్ను, నీ పార్టీని బంగాళాఖాతంలోకి విసిరేయడం ఖాయమని అభిప్రాయపడ్డారు. పార్టీ శ్రేణులు అధైర్యపడవద్దని.. అలజడికి లోనుకావద్దని.. ఎటువంటి అవాంఛనీయ ఘటలకు పాల్పడవద్దని.. మన నాయకుడు కడిగిన ముత్యంలా మనమందుకు వస్తారని.. మనల్ని ముందుకు నడిపిస్తారని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అరెస్టుతో ఆనందపడుతున్న వారంతా రాబోయేది తెదేపా ప్రభుత్వమని గుర్తుంచుకవాలని.. అధికార అండతో చేస్తున్న ప్రతి పాపానికి, రాజ్యాంగ ఉల్లంఘనలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.