క్వారీ సెంటర్ లో మట్టి వినాయక విగ్రహాలు ఉచిత పంపిణీలో ఎంపీ భరత్
రాజమండ్రి, సెప్టెంబరు 17: గణములకు అధిపతి గణపతి అని, ఆయన దివ్య ఆశీస్సులు అందరిపైనా ప్రసరింపజేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆకాంక్షించారు. వినాయక చవితిని పురస్కరించుకుని ఆదివారం నగరంలోని క్వారీ సెంటర్ లో వైసీపీ నేత అజ్జరపు వాసు ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తలపెట్టిన అజ్జరపు వాసును ఎంపీ భరత్ అభినందించారు. వినాయక చవితి పూజ వెనుక ఎంతో విశిష్టమైన పరమార్ధం ఉందన్నారు. ఒక వైపు భక్తి, మరొక వైపు పర్యావరణపై అవగాహన మిళితమై ఉందన్నారు. వినాయకుడిని మట్టితో తయారు చేయడం, పూజానంతరం నీటిలో నిమజ్జనం చేయడం, విఘ్నేశ్వరునికి వివిధ రకాల పత్రితో అర్చించడం..ఇవన్నీ ప్రకృతి ద్వారా మనకు లభించే ఆరోగ్య సూత్రాలను వివరించడానికేనన్నారు. గణపతి పూజను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ద్వారా మనలో ఒక విధమైన ఆత్మ విశ్వాసం, తలచిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా జరుగుతాయనే నమ్మకం, ఆత్మవిశ్వాసం నిండుగా ఉంటుందన్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు నగరంలోని ప్రతీ ఒక్కరికీ ఎంపీ భరత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అజ్జరపు వాసు, గుర్రం గౌతమ్, కడియాల లక్ష్మణరావు, నక్క నగేష్, ఎన్వీ శ్రీనివాస్, పీతా రామకృష్ణ, ఉల్లూరి రాజు తదితరులు పాల్గొన్నారు.