Simultaneous Polls: ‘జమిలి ఎన్నికల కమిటీ’ తొలి భేటీ.. పార్టీల అభిప్రాయాల సేకరణకు నిర్ణయం
దిల్లీ: ‘ఒకే దేశం – ఒకే ఎన్నికల (One Nation, One Election)’ నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ram Nath Kovind) నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే..
ఈ కమిటీ శనివారం దిల్లీలో తొలిసారి సమావేశమైంది. ఈ సందర్భంగా సభ్యులకు స్వాగతం పలికిన కమిటీ ఛైర్మన్ కోవింద్.. సమావేశ అజెండాను వివరించారు. ఈ క్రమంలోనే జమిలి ఎన్నికలపై సూచనలు, అభిప్రాయాలను సేకరించేందుకు గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలను ఆహ్వానించాలని కమిటీ నిర్ణయించింది.
‘జమిలి ఎన్నికలపై సూచనలు, అభిప్రాయాల సేకరణకు.. గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు, పార్లమెంటులో తమ ప్రతినిధులు ఉన్న పార్టీలు, గుర్తింపు పొందిన ఇతర రాష్ట్ర పార్టీలను ఆహ్వానించాలని కమిటీ నిర్ణయించింది. దీంతోపాటు భారత న్యాయ కమిషన్‌ను కూడా కమిటీ ఈ మేరకు ఆహ్వానించింది’ అని ఒక ప్రకటన వెలువడింది. అవసరమైన దస్త్రాల సన్నద్ధత, సంబంధిత పక్షాలతో సంప్రదింపులు ఎలా నిర్వహించాలి? జమిలి ఎన్నికలపై పరిశోధన.. తదితర అంశాలు సమావేశ అజెండాలో భాగమైనట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి..