హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టీఎస్ టెట్) ఫలితాలు నేడు రిలీజ్ కానున్నాయి. ఉదయం10 గంటలకు https://tstet.cgg.gov.in వెబ్ సైట్లో ఫలితాలు పెడతామని టీఎస్ టెట్ చైర్మన్ శ్రీదేవసేన తెలిపారు.
ఈ నెల15న జరిగిన టెట్ఎగ్జామ్ పేపర్1కు 2,26,744 మంది, పేపర్ 2కు 1,89,963 మంది హాజరయ్యారు. 20న ప్రిలిమినరీ కీ రిలీజ్ చేసి, 23వ తేదీ వరకు అభ్యంతరాలు తీసుకున్నారు.
పలు ప్రశ్నలు తప్పుగా వచ్చాయని, వాటికి మార్కులు కలుపుతామని ప్రిలిమినరీ కీ విడుదల చేసిన టైమ్‌లోనే అధికారులు ప్రకటించారు. పేపర్1 తెలుగు మీడియంలో కోడ్ ‘ఏ’ పేపర్‌లో 43వ ప్రశ్నకు 3, 4 రెండూ సరైన ఆప్షన్లు అని, 108, 111 క్వశ్చన్లకు మార్కులు కలుపుతామని తెలిపారు. కోడ్ ‘బీ’లో 33వ ప్రశ్నకు1, 4 ఆప్షన్లు కరెక్ట్ అని, 96, 105 ప్రశ్నలకు మార్కులు కలుపుతామన్నారు.
కోడ్ ‘సీ’ పేపర్‌లో 38వ ప్రశ్నలో1, 2 ఆన్సర్స్ కరెక్ట్ అని, 93, 102 క్వశ్చన్లకు మార్కులు కలుపుతామని చెప్పారు. పేపర్ కోడ్ ‘డీ’లో 43వ క్వశ్చన్‌కు 2, 3 ఆన్సర్స్ కరెక్ట్ అని, 99, 114 క్వశ్చన్లకు మార్కులు యాడ్ చేస్తామని అధికారులు తెలిపారు.