అమరావతి: సోషల్ మీడియాలో కుట్ర పూరిత విద్వేష పోస్టులు పెట్టేవారిపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా జవాబుదారీతనం, పౌరుల రక్షణను బలోపేతం చేయడం అనే అంశంపై రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మంత్రుల బృందం సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీ యాక్ట్ 2000 – సేఫ్ హార్బర్, బ్లాకింగ్ పవర్స్, ఐటీ రూల్స్ 2021 – కంప్లయన్స్ అండ్ ట్రేసబిలిటీ, డిపీడీపీ యాక్ట్- 2023 డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్ వర్క్, జ్యుడీషియల్ సేఫ్ గార్డ్స్ – ఫ్రెష్ స్పీచ్ & ప్రైవసీ లపై చర్చించారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ప్రభుత్వ నిర్ణయాలపై సద్విమర్శలను స్వాగతిస్తాం, ఉద్దేశపూర్వక విద్వేష వ్యాఖ్యలను సహించం. ఏఐ ఆధారిత డీప్ ఫేక్ అసభ్య కంటెంట్ ను అరికట్టాలి, నిర్ణీత వయసు ఆధారిత సోషల్ మీడియాకు వచ్చేలా నిబంధనలు రూపొందించాలి. మహిళలపై అవమానకర, అసభ్య పోస్టులు పెట్టే వారిపై నిఘా పెట్టాలి.