హైదరాబాద్:సెప్టెంబర్ 15
మాదాపూర్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీ హీరో నవదీప్ పరారీలో ఉన్నారని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
డ్రగ్స్ కేసులో నవదీప్ కస్టమర్‌గా ఉన్నాడని ఆయన తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నవదీప్ కోసం వెదుకుతున్నామన్నారు. అలాగే మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్ ను అరెస్ట్ చేశామని సీవీ ఆనంద్ తెలిపారు.
అయితే తాను పరారీలో లేనని, హైదరాబాద్‌లోనే ఉన్నానని నవదీప్ మీడియాకు చెబుతున్నట్లు తెలిసింది. తాను షూటింగ్ లో ఉన్నానని కూడా ఆయన చెప్పడం విశేషం. తాను ఒక సాంగ్ రిలీజ్ లో ఉన్నానని నవదీప్ అంటున్నారు. గతంలో డ్రగ్స్ కేసులోనూ నవదీప్ పేరు వినిపించింది.
బేబీ సినిమా పై సీపీ ఆనంద్ సీరియస్ అయ్యారు. ఆ సినిమాలో డ్రగ్స్ ను ప్రోత్సహిస్తూ తీయడం సరికాదన్నారు. బేబీ సినిమా టీంకు నోటీసులు జారీ చేస్తామన్న ఆయన చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
స్మార్ట్ పబ్ ఓనర్ సూర్యతో పాటు అర్జున్, సినీ నిర్మాత రవి ఉప్పలపాటి, శ్వేత, కార్తీక్ లు కూడా పరారీలో ఉన్నారని, వారందరినీ పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలు వెళ్లాయన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. వారి సెల్ ఫోన్ లు స్విచాఫ్ చేసుకుని కుటుంబాలతో సహా పరారయ్యారని సీవీ ఆనంద్ తెలిపారు..